Deputy CM Bhatti Vikramarka: బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోచుకున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka: ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పని చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు అభాండాలు వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఆయన, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన భట్టి, ధనిక రాష్ట్రాన్ని ఖాళీ చేసి, పేదల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారని ఆరోపించారు. హరీష్ రావు వంటి నేతలు ఏదో ఒక అభాండం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తడిచిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.14 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 30 లక్షల పంపు సెట్ల విద్యుత్ బిల్లులు రూ.14 వేల కోట్లు డిస్కమ్‌లకు చెల్లిస్తున్నామని, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.5 వేల కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. గతంలో బీఆర్‌ఎస్ ఉచిత విద్యుత్ ఇచ్చినా డిస్కమ్‌లకు డబ్బులు చెల్లించలేదని, ప్రస్తుతం చెల్లిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, రైతులకు రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒకప్పుడు వలసల ప్రాంతమని, ఇప్పుడు అభివృద్ధి జరుగుతోందని, రఘునాథపల్లిలో 230 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటును పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ పర్యటనలో భట్టి విక్రమార్క అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.