Minister Gaddam Vivek: అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ మొదలు : మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్
మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్
Minister Gaddam Vivek: తెలంగాణలో అక్రమ మైనింగ్ కేసులపై సీబీసీఐడీ విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెల్లడించారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఈ విచారణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రిగా ఏడాది పూర్తి సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన వివేక్, గత బీఆర్‌ఎస్ పాలనలో ఇసుక గుత్తేదారులు ఇష్టం వచ్చినట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మెటల్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖనిజాలను వేలం ద్వారా లీజుకు ఇస్తున్నామని, ఈ ఏడాది ఇసుక ద్వారా రూ.1,200 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
గిగ్ వర్కర్ల చట్టం, ఉపాధి కల్పన కార్యక్రమాలు
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టం తీసుకొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసిన మంత్రి, దీన్ని త్వరలోనే లాంఛనంగా అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం 65 ఐటీఐలను రూ.2,500 కోట్లతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా (ఏటీసీ) మార్చామని, రాష్ట్రంలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జూన్ 15న ప్రారంభించనున్నట్లు మంత్రి గడ్డం వివేక్ ప్రకటించారు.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని మంత్రి అన్నారు.