CM Revanth Reddy: కేంద్రం నా అమెరికా పర్యటనను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణకు వచ్చే విదేశీ పెట్టుబడులను అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు అమెరికా, కెనడా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు నిరాకరించడం రాజకీయ వివక్ష, రాష్ట్రం పై చిన్నచూపు, నాలుగు కోట్ల ప్రజలకు అవమానం అని మండిపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
లండన్ పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట గుజరాత్ సీఎం కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా వెళ్లారు. అమెరికా పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా తెలంగాణకు వెళ్తాయన్న ఉద్దేశంతోనే నా పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఇది పూర్తిగా రాజకీయ వివక్ష. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’’ అని ఆయన అన్నారు.
లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికాకు నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసినప్పుడే అన్ని వివరాలు, సమావేశాల వివరాలు స్పష్టంగా సమర్పించామని, ఇది చాటుమాటు వ్యవహారం కాదని తెలిపారు. అధికారిక పర్యటనలో విదేశీ రాయబారులు వెంట ఉంటారని, ప్రతి కార్యక్రమం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా గుజరాత్ సీఎం, సలహాదారు మాదిరిగానే వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిని రావచ్చు. మేం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా?’’ అని నిలదీశారు.
తెలంగాణను కేంద్రం చులకనగా చూస్తోందని, చిన్నచూపుతో వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరని, అధికారులను పంపించి ఒప్పందాలు తీసుకురావడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్న నేపథ్యంలోనే ఈ పర్యటనను ప్రణాళిక చేశామని తెలిపారు. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా సహకారం లేదని, పార్లమెంట్‌లో తమ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తి ప్రధానిని నిలదీస్తామని హెచ్చరించారు.
మంత్రి కొండా సురేఖ అంశంపై ప్రశ్నించగా, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అది క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.