Congress Party: మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అందింది. మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ ఈ నివేదికను అందజేశారు.

నివేదిక సమర్పించిన తర్వాత గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి, కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ ఆధారంగా సమగ్ర నివేదిక తయారు చేసి పీసీసీ అధ్యక్షుడికి అందజేశామని చెప్పారు. ఈ నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు పంపారని, ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి కూడా పంపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

‘‘హద్దులు దాటిన నేతలందరికీ స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాల్సి ఉంది. క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండాలని నివేదికలో పేర్కొన్నాం. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎవరూ బయటపెట్టొద్దని ప్రధానంగా సూచించాం. కాంగ్రెస్ గౌరవాన్ని దెబ్బతీసే పనులు ఎవరూ చేయొద్దు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దు’’ అని మల్లు రవి అన్నారు. నివేదికలో ఏముందో ముందే చెప్పితే అధిష్ఠానం నుంచి నోటీసులు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నివేదికను సీఎం రేవంత్‌కు ఇవ్వలేదని, పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి పీసీసీ అధ్యక్షుడికే అందజేశామని చెప్పారు.

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యక్తిగతంగా కలవలేదని, గాంధీభవన్‌లో వివరణ లేఖ ఇచ్చి వెళ్లారని మల్లు రవి తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలు, గత విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైనదని, దానిపైనే పార్టీ గౌరవం ఆధారపడి ఉంటుందని, ఆ గౌరవం ఉంటేనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నివేదికలో క్రమశిక్షణ కమిటీ పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. పార్టీ నియమాలను కొండా సురేఖ ఉల్లంఘించడం ఇది మూడోసారి కావడంతో, ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతగా, గతంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన చిన్నారెడ్డి కూడా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని, క్యాబినెట్ ర్యాంకు పదవి నుంచి ఆయనను తొలగించాలని కమిటీ సూచించినట్లు సమాచారం. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సిందని కమిటీ అభిప్రాయపడినట్లు కూడా తెలుస్తోంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కమిటీ నివేదిక నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags: