Minister N. Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. ఇతర రాష్ట్రాలకు 52-86%.. తెలంగాణకు 38% మాత్రమే: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Minister N. Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి విషయం వివరించినా ధోరణి మార్చుకోవడం లేదని విమర్శించారు.
శుక్రవారం సచివాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భాజపా నేతలు కొనుగోలు కేంద్రాలు, కల్లాల చుట్టూ తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా చూడాలని సూచించారు.
తెలంగాణ వెన్నెముకగా నిలుస్తోంది
దేశ ఆహార భద్రతకు తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 282.22 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 147 లక్షల టన్నులు సేకరించారు. దేశవ్యాప్త యాసంగి కొనుగోళ్లలో తెలంగాణ వాటా ఇప్పటికే 60 శాతానికి చేరింది.
అయితే, రాష్ట్రంలో వరి ఉత్పత్తి 28 శాతం పెరిగినా కేంద్రం సేకరణ లక్ష్యాన్ని భారీగా తగ్గించిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. గతంలో 79 లక్షల టన్నుల లక్ష్యం ఉంటే ఈ ఏడాది 51.47 లక్షల టన్నులకు కుదించి 35 శాతం కోత విధించింది.
రాష్ట్రాల వారీగా కేంద్రం నిర్దేశించిన సేకరణ శాతాలు:
పంజాబ్: 86%
ఛత్తీస్‌గఢ్: 67%
హరియాణా: 65%
ఒడిశా: 52%
తెలంగాణ: 38%
పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మంత్రి ఆరోపించారు.
మంత్రి తుమ్మల విమర్శలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, భాజపా, భారాస నాయకులు రాజకీయ ప్రేరేపిత విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం సమస్యలు సృష్టిస్తుంటే భాజపా నేతలు ఆందోళనలు చేయడం విచిత్రమని వ్యాఖ్యానించారు. రైతుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు జమ చేసిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదేనని చెప్పారు. మొక్కజొన్న 14 లక్షల టన్నులు సేకరించి మరో 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యూరియా సరఫరాలో కేంద్రం బాధ్యత నిర్వర్తించాలని, లోపాలు ఉంటే భాజపా నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ ప్రజంటేషన్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ ఆర్. రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు పాల్గొన్నారు.