Minister Ponguleti: గ్రామీణ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాది పాటు ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి సహకారం రాలేదని ఆయన తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తైన 15,475 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.185 కోట్లు విడుదల చేసిందని, ఈ నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా నిధులు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఫలితంగా ఇళ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ డిమాండ్‌ ఉందని పొంగులేటి అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పలుమార్లు కలిశారని, తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారని ఆయన వివరించారు. రెండు వారాల క్రితం తాను కూడా ఎంపీలతో కలిసి వెళ్లి ఇళ్లు మంజూరు కోసం కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశానని, అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు.

కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా ఆపేశామని, ఇక పేద ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సెప్టెంబరు 15లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా ఆయన వెల్లడించారు.

Tags: