Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమెపై వేటు వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటే సురేఖ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అనే ప్రశ్న కూడా తీవ్రంగా వినిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా సురేఖపై రాజకీయ వర్గాల్లో సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై వేటు వేయడానికి సర్వం సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సురేఖ తన కూతురి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయినా కుమార్తె మాటలను బహిరంగంగా ఖండించకపోవడంతో సురేఖపై వేటు వేయాలని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వేటు విషయంపై క్లారిటీ వచ్చాకే స్పందించాలని సురేఖ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి మౌనదీక్ష చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. నిన్నటి మంగళవారం నుంచి ఆమె హనుమకొండ రామ్‌నగర్‌లోని తన నివాసంలో ఒంటరిగా ఉన్నారని సమాచారం. ఎవరినీ కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం లేదు.

కాంగ్రెస్ వేటు వేస్తే ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్ని వార్తలు వచ్చినా కొండా దంపతులు మాత్రం స్పందించడం లేదు.. ఖండించడమూ లేదు. దీంతో వీరి వ్యూహం ఏంటో ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తర్వాతే స్పందన ఉంటుందని భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఆగస్టు 25న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రిపోర్ట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేశారు. ఈ రిపోర్ట్‌లో సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డిని కూడా తొలగించాలని, ఇద్దరినీ పార్టీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇప్పుడు బంతి అధిష్ఠానం కోర్టులో ఉంది.

మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటుందో ఎదురుచూస్తున్నారు.

Tags: