CM A. Revanth Reddy: తుంగభద్ర వాటాలో కేంద్రం జోక్యం చేసుకోవాలి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి

Update: 2026-06-25 02:31 GMT

తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ నిర్వహణకు బోర్డును పటిష్ఠం చేయాలి

CM A. Revanth Reddy: తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్‌, నదీప్రవాహం నుంచి రాష్ట్రానికి హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని సీఎం తెలిపారు. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును పటిష్ఠం చేసి, నీటి వాటాల సమర్థవంతమైన వినియోగానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్‌డీఎస్‌, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్‌డీఎస్‌ ఆనకట్ట ప్రమాదకర స్థితికి చేరుకుందని, భద్రత దృష్ట్యా అవసరమైన పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌డీఎస్‌ డైవర్షన్‌ కెనాల్‌ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 కోట్లు డిపాజిట్‌ చేసినా పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ప్యాకేజీ-1, 2 పనులు నిలిచిపోగా, 3, 4 ప్యాకేజీలు మాత్రం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఆర్‌డీఎస్‌ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడం వల్ల నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజినీర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 2004లో నిపుణుల కమిటీ సూచించిన పూడికతీత చర్యలు ఇప్పటికీ అమలు కాలేదని, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. పూడిక పేరుకున్న ప్రాంతం కర్ణాటకలో ఉన్నందున ఆ రాష్ట్ర సహకారం కూడా తీసుకోవాలని చర్చించారు.

పూడికతీతతో పాటు 2004 నిపుణుల కమిటీ సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతి పత్రం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని, తుమ్మిళ్ల నుంచి నీటిని వాడుకోవడానికి మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలని సీఎం సూచించారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరచడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రంతో చర్చలు జరపాలని అధికారులకు సూచించారు. ఆర్‌డీఎస్‌ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆర్‌డీఎస్‌ రైతులు ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు. ఏపీ, కర్ణాటక సీఎంలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

ఆర్‌డీఎస్‌ ఆనకట్ట నుంచి కాలువ ప్రవేశ ద్వారం వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించడం, గ్రేడియంట్లను పునరుద్ధరించడం, డ్రెడ్జింగ్‌, కాలువ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News