Changes Proposed in Musi Project: మూసీ ప్రాజెక్ట్‌లో మార్పులు: తక్కువ భూసేకరణకు ప్రాధాన్యం- మంత్రివర్గ ఉపసంఘం
తక్కువ భూసేకరణకు ప్రాధాన్యం- మంత్రివర్గ ఉపసంఘం
Changes Proposed in Musi Project: ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా పక్షపాతిగా మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును అమలు చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. భూసేకరణను కనిష్ట స్థాయికి తగ్గించేలా ప్రాజెక్టు ప్రణాళికల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రజాభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. మూసీ అభివృద్ధి పనులపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు, అధికారుల ప్రణాళికలను వివరంగా అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
నిర్మాణాలు లేని ప్రాంతాల్లో ముందుగా పనులు
మూసీ నది హైదరాబాద్ నగరంలో 55 కి.మీ.ల మేర ప్రవహిస్తుంది. జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు 21 కి.మీ.ల నదీ పరీవాహక ప్రాంతాన్ని మొదటి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో సాంకేతిక, ఆర్థిక చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఉపసంఘం తెలిపింది.
నిర్మాణాలు లేని 5 కి.మీ.ల నదీ పరీవాహక ప్రాంతంలో మొదటగా పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. డీపీఆర్ వివరాలను మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎమ్మార్డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి మంత్రులకు వివరించారు.
ప్రయోజనాలు ప్రజలకు చేర్చాలి
మూసీ ప్రాజెక్టు ద్వారా నగరానికి కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. అన్ని అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసి 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలని, 2027 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని స్పష్టమైన క్యాలెండర్‌తో రూపొందించాలని కూడా తెలిపారు.
నిర్మాణ పనుల్లో సాంకేతిక సహాయం కోసం జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణుల సేవలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటించేలా పర్యవేక్షణ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రబ్బర్ డ్యామ్‌లు, వాటర్ స్పోర్ట్స్
నదిలో పలు చోట్ల రబ్బర్ డ్యామ్‌లను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసి వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ రబ్బర్ డ్యామ్‌ల నమూనాలను సమావేశంలో ప్రదర్శించారు. ఒబెర్‌మెయర్ స్పిల్‌వే గేట్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ డ్యామ్‌లను నాసిక్, ముంబైలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు.
సమావేశంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.