Minister Komatireddy Orders Measures to Avoid Jams: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీకి చెక్: ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకోండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకోండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

Update: 2025-12-30 13:59 GMT

Minister Komatireddy Orders Measures to Avoid Jams: సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారులపై ఏర్పడే భారీ వాహనాల రద్దీని అరికట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి తెలిపారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ తీవ్రంగా పెరుగుతుందని అంచనా. రోజుకు దాదాపు లక్ష వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం తూప్రాన్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో మంత్రి స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు.

ప్రధానంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి ప్రాంతాల్లో వేలాది వాహనాలు గుమికూడుతాయని, ఈ చోట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో రోడ్లపై లేన్లు మూయకూడదు, భారీ యంత్రాలతో పనులు చేపట్టకూడదు. అత్యవసర పనులు ఉంటే రాత్రి వేళల్లో మాత్రమే నిర్వహించాలి. రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు పనులు జరుగుతున్న ప్రతీ ప్రాంతంలో పగలు-రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ సైన్ బోర్డులు, హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పని జరుగుతున్న చోట, ట్రాఫిక్ వెళ్లే మార్గం స్పష్టంగా సూచించాలి. ఎక్కడా వాహనదారులకు అయోమయం కలగకూడదు.

రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణలో స్థానిక పోలీసులతో నిరంతర సమన్వయం చేసుకోవాలి. అన్ని శాఖలు పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలి. రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగిపోకుండా అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News