A. Revanth Reddy: అభివృద్ధికి నిధుల కొరత లేదు – కూకట్‌పల్లిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

కూకట్‌పల్లిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

Update: 2026-03-10 14:27 GMT

A. Revanth Reddy: రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తనను ఎంపీగా గెలిపించి దిల్లీకి పంపారని, ఆ పరిధిలోని కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం తనకు ఎంతో ప్రత్యేకమని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అన్నారు. కష్టకాలంలో కూకట్‌పల్లి ప్రజలు తనకు అండగా నిలిచారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాంతానికి అవసరమైన పైవంతెనలు, చెరువులు, నాలాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల అభివృద్ధికి అప్పు చేసైనా ఎన్ని నిధులైనా కేటాయిస్తానని స్పష్టం చేశారు.

సోమవారం కూకట్‌పల్లిలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అభివృద్ధి చేసిన నల్లచెరువు ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడికక్కడే పలు అభివృద్ధి పనులకు ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్‌కు రోజూ వివిధ ప్రాంతాల నుంచి వలసలు జరుగుతున్నాయని, కొందరు చెరువులు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారని ఆయన తెలిపారు. దీంతో చెరువుల్లో నిలవాల్సిన నీరు కాలనీలను ముంచెత్తుతోందన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కూకట్‌పల్లి, నిజాంపేట్‌లలో నడుముల్లోతు నీరు నిలిచేదని, అప్పుడే చెరువుల అభివృద్ధి నిర్ణయం తీసుకున్నానని గుర్తుచేశారు.

హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు వందల మంది తిట్టారని, ఇప్పుడు అభివృద్ధి చెందిన చెరువులు చూసి ఆ తిట్లు ఆశీర్వాదాలుగా మారినట్లు భావిస్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు. ముంబయి, చెన్నైలలో వరద ముప్పు ఉందని, బెంగళూరుకు ట్రాఫిక్ సమస్య ఉందని, హైదరాబాద్ మాత్రమే సురక్షితంగా ఉందని చెప్పారు. ఇలాగే కొనసాగాలంటే చెరువులు, రోడ్లతోపాటు మూసీ నదిని కూడా అభివృద్ధి చేయాలన్నారు.

పేదల ఇళ్లు కూల్చడం సంతోషం కాదని, నిజమైన బాధితులకు రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యేలకు చెప్పానని తెలిపారు. రోడ్లు, నాలాల విస్తరణలో నష్టపోయేవారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News