Chief Minister Revanth Reddy: కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి.. వరద బాధిత ప్రాంతాల పరిశీలన
వరద బాధిత ప్రాంతాల పరిశీలన
Chief Minister Revanth Reddy: భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వరద బాధిత ప్రాంతాలను సందర్శించేందుకు గురువారం (సెప్టెంబర్ 4, 2025) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. మొదట ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటన చేసి, వరదలతో ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ పంటల నష్టం, ఆస్తి నష్టం సహా వివిధ వివరాలను అధికారుల నుండి సేకరించారు.
మధ్యాహ్నం ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా కామారెడ్డి జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులతో కలిసి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో దిగారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సు (ప్రజా సంక్షేమ రథం)లో వరద బాధిత ప్రాంతాలకు పయనమయ్యారు.
లింగంపేటలో వరదలతో దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్‌ను సీఎం పరిశీలించారు. వరద సమయంలో బ్రిడ్జ్ పరిస్థితిని ప్రదర్శించే ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, బ్రిడ్జ్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ రీతిలో నిర్మాణం చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. పూర్తి అంచనాలతో బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.