Greenfield Kitchen: పిల్లల ఆరోగ్యమే రాష్ట్ర పురోగతి – సూర్యాపేటలో గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌కు భూమి పూజ
భూమి పూజ
Greenfield Kitchen: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.
మొదట చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల తెలంగాణ జెన్‌కో జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆ తర్వాత మునగాల మండలం ఎస్‌ఎంపేటలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన సింగరేణి కంపెనీ ఇచ్చిన రూ.9.60 కోట్ల విరాళంతో నిర్మించనున్న మెగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌కు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కిచెన్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అని, శుచి, శుభ్రత, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలోని 1,029 పాఠశాలల్లోని 60 వేల మంది విద్యార్థులకు హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఇండియా సహకారంతో అల్పాహారం అందించనున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి మంచి విద్య సాధించి ఉన్నత స్థానాల్లో నిలిస్తే రాష్ట్ర ఉత్పత్తికి గణనీయంగా తోడ్పడతారని ఆయన అన్నారు.
పులిచింతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని హైడల్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని, కేవలం నీళ్లు అందుబాటులో లేనందున విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని భట్టి విక్రమార్క వివరించారు. గతంలో ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 14-15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈసారి దాదాపు 20 వేల మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. రాత్రి వేళల్లో డిమాండ్‌కు తగినట్లు అందుబాటులో ఉన్న థర్మల్ పవర్‌ను ఉపయోగిస్తున్నామని, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సాధ్యమైనంత వరకు తాగునీటి కోసం దాచుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారని తెలిపారు. నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని కూడా ప్రకటించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో దేశానికి రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని అన్నారు. నాలుగు నెలల్లోగా గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు.