Minister Komatireddy Venkat Reddy: తెలంగాణలోని జాతీయ రహదారులు, రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు.

గుజరాత్‌లో జరుగుతున్న చింతన్‌ శివిర్‌లో సోమవారం కేంద్రమంత్రితో భేటీ అయిన కోమటిరెడ్డి, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల వివరాలు వివరించారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని, పర్వతమాల పథకం కింద రాష్ట్రంలో ఐదు రోప్‌వేలకు రూ.1,230 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సేతు బంధన్‌ పథకంలో భాగంగా మూడు కీలక ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ ప్రాజెక్టులకు కూడా అనుమతి కావాలన్నారు.

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్‌-శ్రీశైలం ఎన్‌హెచ్‌-765 పరిధిలోని పులుల అభయారణ్య ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 33 రహదారి అభివృద్ధి పనులకు రూ.1,227 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో క్యాబినెట్‌ ఆమోదం తెలపాలని, దక్షిణభాగం పనులను కూడా ఉత్తరభాగంతో సమాంతరంగా పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా కోమటిరెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Tags: