CM Revanth Orders: టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించాలి: సీఎం రేవంత్ ఆదేశాలు
సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Orders: తెలంగాణలో స్టార్టప్‌ల ప్రముఖ కేంద్రంగా ఉన్న టీ-హబ్‌ను (T-Hub) అదే రూపంలో, స్టార్టప్‌లకు అంకితమైన హబ్‌గానే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి సూచనలు అందించారు. టీ-హబ్‌లో అద్దె భవనాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వచ్చిన వార్తలను సీఎం తీవ్రంగా ఖండించారు.
"టీ-హబ్‌లో ఇతర ప్రభుత్వ ఆఫీసులు లేవా వేరే కార్యాలయాలు ఏవీ ఉండకూడదు" అని ఆయన స్పష్టంగా తేల్చిచెప్పారు. అలాంటి ఆలోచనలను అధికారులు వదిలేయాలని, టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌లకు, ఇన్నోవేషన్‌కు అంకితం చేయాలని ఆదేశించారు.
అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రభుత్వ భవనాలకు లేదా సొంత ఆస్తులకు తరలించాలని సీఎం సూచించారు. ఇలా చేయడం ద్వారా టీ-హబ్‌ను స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మరింత బలోపేతం చేయవచ్చని, హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఆయన భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో టీ-హబ్‌లో పనిచేస్తున్న స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్లకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఇలాంటి చర్యలతో కట్టుబడి ఉందని సంకేతమిచ్చింది.