CM Revanth Reddy: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్వహణ సరిగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌పై కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో సీఎం మాట్లాడుతూ, అన్ని రకాల రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ సహా అన్ని అంశాలను ఈ వ్యవస్థలోకి తీసుకురావాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర రోడ్లు కూడా ఇందులోకి రావాలని సూచించారు.

టీడీఆర్‌పై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్‌ అమలు చేయాలని ఆదేశించారు. టీడీఆర్‌ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించి, అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలన్నారు. రేడియల్‌ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కొంగర కలాన్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు రేడియల్‌ రోడ్‌-1ను డిసెంబరు 9లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.

రహదారుల నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని, రోడ్లకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బుద్వేల్‌ ఇంటర్‌ఛేంజ్‌ ట్రంపెట్‌ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎలివేటెడ్‌ కారిడార్స్‌ 1, 2 పనులను వేగవంతం చేయాలని, బంజారాహిల్స్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ రోడ్‌ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

రహదారుల అభివృద్ధిపైనే హైదరాబాద్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని నొక్కి చెప్పిన సీఎం, భూసేకరణను వేగవంతం చేయాలని, అలసత్వం చూపించొద్దని హెచ్చరించారు. రోడ్ల ప్లానింగ్‌, నిర్మాణంలో ట్రాఫిక్‌ విభాగాన్ని కూడా ఇన్‌వాల్వ్‌ చేయాలని, ల్యాండ్‌ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించొద్దని స్పష్టం చేశారు.

Tags: