Godavari and Krishna Pushkaralu: గోదావరి, కృష్ణా పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి.. ఘాట్స్ అభివృద్ధికి కీలక సూచనలు
ఘాట్స్ అభివృద్ధికి కీలక సూచనలు
Godavari and Krishna Pushkaralu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు జారీ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఘాట్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలను ఎంపిక చేసి శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అనువైన ఆలయాలను ఎంపిక చేయాలని సూచించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి ప్రముఖ ఆలయాలతో పాటు ఇతర కీలక ఆలయాలను జాబితా చేసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుత ఘాట్స్‌ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. పుష్కరాల సమయంలో సుమారు రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి స్నానమాచరించేలా ఘాట్స్‌ను అభివృద్ధి చేయాలని, ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విభిన్న డిజైన్లతో ఘాట్స్ రూపొందించాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.