CM Revanth Reddy Questions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించింది? నేరాలు చేసి ప్రశ్నలు రాకుండా ఉండాలనుకుంటున్నారా?

నేరాలు చేసి ప్రశ్నలు రాకుండా ఉండాలనుకుంటున్నారా?

Update: 2026-02-03 06:12 GMT

CM Revanth Reddy Questions: తెలంగాణలో అన్ని పదవులనూ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని, వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వారికి ఎలా వచ్చాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. "నేరాలు చేస్తాం.. ప్రశ్నించొద్దంటే ఎలా?" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో 'తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు' ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డు-2025 ప్రదాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు సీఎంను సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "నేను రాష్ట్రంలో లేకపోయినా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉంటా. ఈ మధ్య కొంతమంది తామే తెలంగాణ జాతిపిత అని అనుకుంటున్నారు. ఉద్యమకారులమని వారికి వారే రాసుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే.. జాతిపితకు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే ఇచ్చినట్టు అంటున్నారు" అని విమర్శించారు.

ఆనాటి జాతిపిత దేనికి ఆదర్శంగా నిలబడ్డారని, ఏదైనా పదవి తీసుకున్నారా? స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలోపే తుపాకీ తూటాలకు నేలకొరిగారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో సర్వం కోల్పోయిన వారు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారని, కానీ కేసీఆర్ కుటుంబం వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, రూ. వేల కోట్లు సంపాదించిందని ప్రశ్నించారు. "చేయాల్సిన తప్పులన్నీ చేసిన మీరెలా జాతిపిత అవుతారు? ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ ఓటమిని ప్రజలపైనే నెట్టడం ఎంత వరకు సబబు?" అని అన్నారు.

ప్రొ. కోదండరాంను ఉద్యమకారుడిగా గుర్తించకుండా, ఆనాడు ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారని, మేం ఆదివారం ఎవరినీ అరెస్టు చేయలేదని, ఎవరి తలుపులు బద్దలు కొట్టలేదని ప్రశ్నించారు. కోదండరాంను పెద్దల సభకు తీసుకురావడం వాళ్లకు ఇష్టం లేదని, అందుకే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు.

ఓటు హక్కును కాలరాసే కుట్ర 'సర్' (స్వయం గుర్తింపు)తో జరుగుతోందని, నిరక్షరాస్యుల ఓటు హక్కును కాలరాయాలనుకుంటున్నవారు రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంపై దాడి అని అన్నారు.

రావి నారాయణరెడ్డి విగ్రహ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఆయన సూచించిన మార్గాన్ని అనుసరిస్తూ, స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ అవార్డును సముచితమైన సమయంలో సముచితమైన వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అందించారని తెలిపారు. 60 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణరెడ్డి కానీ, నేటి నేతలకు ప్రజలు తిరస్కరించినా పదవీ వ్యామోహం పోవట్లేదని విమర్శించారు.

Tags:    

Similar News