Minister Jupally Krishna Rao: వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే అధికారం: మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister Jupally Krishna Rao: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు అచ్చంపేట సభలో రైతులపై మొసలి కన్నీరు కార్చారని, భారాస పదేండ్ల పాలనలో అన్నదాతల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఎంపీ మల్లు రవి, విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి తదితరులతో కలిసి మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ మీడియా హాలులో మంత్రి జూపల్లి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష రైతు రుణమాఫీకి నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భారాస పాలన సాగలేదు. రైతుబంధు కోసం ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇచ్చిన ఘన చరిత్ర వారిది’’ అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలతోపాటు చెప్పని వాగ్దానాలను కూడా అమలు చేస్తున్నామని జూపల్లి తెలిపారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, భారాస సర్కార్ ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్న చిత్రంలో ఎంపీ మల్లు రవి, విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.