Chief Secretary Sanjay Jaju: రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్య కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 67 పాఠశాలలు, 2028 జూన్‌ నాటికి 87 పాఠశాలలు పూర్తి చేయాలని సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సూచించారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎస్‌ తెలిపారు. ఈ క్రమంలో నిర్మాణ పనులు వేగంగా జరగాలని ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చారు.

ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుపై కూడా సమీక్ష జరిగింది. పలు ప్రముఖ విదేశీ వర్సిటీలు ఫ్యూచర్‌ సిటీలో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు వివరించారు. వీటిని రప్పించేందుకు మౌలిక వసతులు, పెట్టుబడులు వంటి అంశాలతో ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎస్‌ ఆదేశించారు.

గ్లోబల్‌ సమిట్‌ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి విస్తృత భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. అన్ని రంగాలకు సంబంధించిన టెండరింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: