Kishan Reddy: దానం అనర్హత బీజేపీ న్యాయ పోరాటం విజయమే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
విమర్శలు
Kishan Reddy: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అధికార దాహంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఓపెన్ ల్యాండ్ ఉంటే ఎలా దోచుకోవాలనే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.
ఎమ్మెల్యేగా కొనసాగుతూనే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ భూదందా పార్టీలేనని కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘దోచుకోవాలి, దాచుకోవాలి.. పది తరాలకు సరిపోయెంత సంపాదించుకోవాలి. దోపిడీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయి’’ అని అన్నారు. బీఆర్‌ఎస్‌పై అనేక అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఒకరిపై ఒకరు పరస్పరం దోపిడీ ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. దోపిడీ చేసిన వారిని ఫామ్‌హౌస్‌లకే పరిమితం చేశారన్నారు.
కేసీఆర్ కుటుంబానికి ఎన్ని ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ఇప్పుడు అడుగుతున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి 3 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి అనేక ఆరోపణలు చేశారు కానీ చర్యలు శూన్యమని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఎంపీ టికెట్ ఇస్తారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అనైతిక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దుర్మార్గపు రాజకీయ అవినీతిపరులను తరిమికొట్టాలని కోరారు. ఏ ఎన్నికలకైనా బీజేపీ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.