Minister Uttam Kumar Reddy: వచ్చే వర్షాకాలం నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని, ఆ తర్వాత ప్రాజెక్టుల్లో నిల్వలు, ఇతర అవసరాలు పరిగణనలోకి తీసుకుని సాగుకు నీరు అందిస్తామని ఆయన తెలిపారు.

శుక్రవారం శాసనసభలో ఎల్‌నినోపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాటి భారాస ప్రభుత్వ వైఫల్యమే రైతుల కష్టాలకు కారణమని విమర్శించారు. పదేళ్లలో రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా ఒక్కటీ ఉపయోగంలోకి రాలేదన్నారు. ‘‘పదేళ్లు పరిపాలించిన భారాస ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం తుమ్మిడిహెట్టికి రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణాన్ని అక్కడ నుంచి మేడిగడ్డకు మార్చడం. ఫలితంగా రూ.34 వేల కోట్లతో పూర్తయ్యే దానికి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టారు’’ అని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టుల పునాదులను నిపుణుల కమిటీ పరిశీలించి అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించిందని, మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పునాదులూ నిర్మించారని తేలిందని ఉత్తమ్‌ తెలిపారు. అందుకే అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటికి మరమ్మతులు చేసే బాధ్యతను ఐఐటీ బాంబేకు అప్పగించామని చెప్పారు. తుమ్మిడిహెట్టితోపాటు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, కొడంగల్‌ ఎత్తిపోతలు, దేవాదుల తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

48.58 లక్షల ఎకరాల ఆయకట్టు, తాగునీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వచ్చే ఏడాది జులై వరకు తాగునీటి అవసరాలు పరిగణనలోకి తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. నదుల్లో ప్రవాహం ఉన్నప్పటికీ, ఆ నీటిని దిగువకు వదిలేస్తున్నారంటూ భారాస నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులపై మరింత బలంగా వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే గోదావరిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 2025-26లో 340 టీఎంసీలు, కృష్ణాలో 2024-25లో 286 టీఎంసీలు వినియోగించామని, ఈ ఏడాది జూన్‌ 1 నుంచి శ్రీశైలంలో ఏపీ 52 టీఎంసీలు తీసుకుంటే తెలంగాణ 84 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో ఏపీ 17.2 టీఎంసీలు తీసుకుంటే తెలంగాణ 23.6 టీఎంసీలు తీసుకుందని గణాంకాలు చూపారు.

అదే సమయంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. దాదాపు 10 వేల బోర్లకు మరమ్మతులు చేసి సిద్ధం చేశామని, ఎల్‌నినో.. వాతావరణ మార్పులతో వచ్చిన సమస్య అని, కొందరు కాంగ్రెస్‌ తీసుకువచ్చిన సమస్యలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గడంతో ఉపాధి హామీకింద పనులు కల్పిస్తున్నామని, పంచాయతీల్లో కనీసం 60 కుటుంబాలకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ చేపట్టామని చెప్పారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్‌నినో కారణంగా అన్ని రంగాలను ఆదుకునేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు, భూగర్భజలాలపై ప్రభావం ఉందని, రైతులు పంటలు కాపాడుకునేందుకు 33 లక్షల బోర్లను నడిపిస్తున్నారని, పంటలు కాపాడేందుకు విద్యుత్తుకు ఎంతైనా ఖర్చు చేస్తామని వెల్లడించారు.

సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు గత 70 ఏళ్లలో ఇలాంటి కరవు ఎప్పుడూ చూడలేదని, ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రైతులు పంటలపై పెట్టిన పెట్టుబడులు వారికి ఇప్పించాలని సూచించారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, భాజపా సభ్యులు కూడా చర్చలో పాల్గొని రైతుల సమస్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags: