Deputy CM Bhatti Vikramarka: విద్యుత్ కొరత నివారణకు థర్మల్ ఉత్పత్తి పెంపు – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు
ఆదేశాలు
Deputy CM Bhatti Vikramarka: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. రానున్న రబీ, వేసవి సీజన్లలో వ్యవసాయ, గృహ విద్యుత్ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు థర్మల్ విద్యుదుత్పత్తిని రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని స్పష్టం చేశారు.
గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రోజువారీ థర్మల్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లుగా ఉందని, దీనిని మరింత పెంచి లక్ష్యాన్ని సాధించాలన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్ ఇండియా నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, నవంబరు నుంచి ఈ మార్గం ద్వారా బొగ్గు సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. ఉత్పత్తిని రోజువారీగా సమీక్షిస్తూ లక్ష్య సాధన దిశగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల పెండింగ్ విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ విధానం అమలు చేయాలని, సింగరేణి, జెన్కో, ట్రాన్స్‌కో తదితర సంస్థలకు వివిధ విభాగాల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీలు హరీశ్, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.