Duddilla Sridhar Babu Says: పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Duddilla Sridhar Babu Says: అంతర్జాతీయ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించి, రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను నిజమైన గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.
ముంబయిలో గురువారం నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ను అమలు చేస్తున్నామని తెలిపారు.
జీసీసీలను సాధారణ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకుండా, వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేందుకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉందని, దీన్ని అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు.
హైదరాబాద్‌లోని ‘సిలికాన్ డెన్సిటీ’ — అంటే వివిధ రంగాల్లోని నైపుణ్యం కలిగిన యువత — ను సద్వినియోగం చేసుకుని ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాస్కామ్ ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.