El Niño: ఎల్‌నినో ప్రభావంతో జులై వరకూ కరవు.. ప్రజల్ని అప్రమత్తం చేయండి: సీఎం రేవంత్
సీఎం రేవంత్
El Niño: అక్టోబరులో మొదలైన కరవు పరిస్థితి వచ్చే ఏడాది జులై వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాగునీటికి తప్ప సాగుకు నీరు లేదని, తాగునీటికీ కష్టాలు రావొచ్చని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్‌లో ఓట్ల తొలగింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సమస్య చిన్నదిగా మొదలై పెద్దదిగా మారుతోందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడొచ్చని సీఎం అన్నారు. ఈ విషయాన్ని దాచిపెడితే క్యాన్సర్‌లా మారుతుందని, ప్రజలను అప్రమత్తం చేయకుండా, వారి భాగస్వామ్యం లేకుండా కరవును ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, సాధ్యమైనంత వరకూ స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాలని, ఏమీ కప్పిపుచ్చవద్దని సూచించారు. భూగర్భ జలాలు లేనందున పంటలు వేస్తే పెట్టుబడి నష్టం వస్తుందని, ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలని, పంటలు వేయకపోయినా ప్రతి కుటుంబానికి పని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎల్‌నినో ప్రభావం ఉత్తర, దక్షిణ తెలంగాణలో వేర్వేరుగా ఉందని, మహారాష్ట్రలో కనీసం 20 శాతం నీటి వినియోగం తగ్గించాలని మార్గదర్శకాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. భారాస నేతలు ‘ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మామ, అల్లుళ్లు ఇద్దరే మేధావులా అని విమర్శించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రణాళికలు చేస్తే హరీశ్‌రావు, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2019లో కరోనా సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ హరీశ్‌రావు మాటలు నమ్మి పంటలు సాగు చేస్తే మట్టి పోసి అంబలి కాచుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజాప్రతినిధులు సమర్థంగా తిప్పికొట్టాలని, రైతువేదికలకు వెళ్లి నిజాలు చెప్పాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనే పొదుపు పాటించాలని, అవసరం లేకపోతే పగటిపూట ట్యూబ్‌లైట్ కూడా వేయవద్దని, ఏసీలు తగ్గించాలని సూచించారు. తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఇళ్లపై సౌర విద్యుత్ పెట్టించి మిగులు కరెంటు అమ్మి లాభం పొందినట్లు చెప్పి, అన్ని గ్రామాల వారిని అక్కడికి తీసుకెళ్లి చూపించాలని, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసి సోలార్ పెట్టించాలని పిలుపునిచ్చారు. ఈ సీజన్‌లో 20 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండు నమోదైందని, ఉత్పత్తి పెంచి ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకు గ్రాసం, నీరు అందించాలని సూచించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం వెనుక కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి ప్రణాళిక రూపొందించారని సీఎం ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి లేని దామరచర్లలో ప్లాంటు పెట్టడంతో రూ.8 వేల కోట్లు అదనంగా భారం పడిందని, యూనిట్ కరెంటు వ్యయం రూ.7 వరకూ అవుతోందని చెప్పారు. జీ9 గ్రేడ్ బొగ్గు లేకపోవడంతో ఇతర రకాల బొగ్గు వాడుతుండటంతో కాలుష్యం పెరుగుతోందని, ఇవన్నీ అసెంబ్లీలో ఎదురుగా చెప్పాలనుకున్నానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయని, భారాసకు బ్యాంకులో రూ.1,500 కోట్లున్నాయని ఆరోపించారు.
సర్ ద్వారా ఓట్లు తొలగించి గెలవాలని చూస్తున్నారని, మోదీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సీఎం అన్నారు. జ్ఞానేశ్ గోబ్యాక్ నినాదంతో రాహుల్‌గాంధీ పెద్ద ఉద్యమం చేస్తున్నారని, తెలంగాణ నుంచి 10-15 వేల మందిని నవంబరు 1న ఢిల్లీ రాంలీలా మైదానానికి తీసుకెళ్లాలని ఏఐసీసీ చెప్పిందని, ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ తడాఖా చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతి మంత్రి 500 మందిని తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు తగ్గిపోయిందని, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో 2021లో 5.31 లక్షల ఓట్లుంటే ఇప్పుడు 1.91 లక్షలే నమోదయ్యాయని, 7 లక్షల ఓటర్ల నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం నియమించిన తర్వాత వాదప్రతివాదాలకు తావులేదని, వారిని గెలిపించుకోవాలని, భారాస, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని అన్నారు.
సంక్రాంతి తర్వాత నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం కావాలని, రూ.వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లు, చెరువులు, కుంటలు, కాల్వలు పునరుద్ధరించే పథకం తెస్తామని ప్రకటించారు. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అందరూ గ్రామాలకు వెళ్లాలని, ఫోన్ లొకేషన్ పర్యవేక్షిస్తామని, వెళ్లని వారికి శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఎల్‌నినోపై రామకృష్ణారావును ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.