Etala Rajender: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తనపై వచ్చిన విమర్శలను ఖండించిన భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌, ఎవరో స్క్రిప్టు రాసిస్తే మాట్లాడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, “ఎవరో ఆడించినట్లు లేదా స్క్రిప్టు రాసిస్తే మాట్లాడే వ్యక్తిని నేను కాదు. మేము స్వయం ప్రకాశకులం. భాజపా కాళేశ్వరం సమస్యను ప్రాధాన్యతా అంశంగా తీసుకుంది. ప్రాజెక్టులు, జల వివక్షపై ఉమ్మడి రాష్ట్రంలోనూ పోరాడిన వ్యక్తిని నేను” అని అన్నారు.

ఎస్సారెస్పీ వచ్చాక మా జిల్లాలో వ్యవసాయం పెరిగిందని, కాళేశ్వరం కంటే ముందే అక్కడ జలయజ్ఞం జరిగిందని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ గురించి అవగాహన ఉన్నవారికి అన్నీ తెలుస్తాయని చెప్పారు. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అప్రమత్తం కాలేదని విమర్శించారు. రైతులకు నీటి సరఫరా బాధ్యత సీఎం మీద ఉందని, అన్నారం, సుందిళ్ల వినియోగంపై విశ్రాంత ఇంజినీర్లతో చర్చించాలని సూచించారు.

చిల్లర వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆయన రైతుల సమస్యలు, నీటి వనరుల పరిరక్షణపై దృష్టి సారించారు.

Tags: