Teacher Negligence: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ సహా ఎవరూ సెల్‌ఫోన్లను తీసుకురాకూడదని విద్యాశాఖ కొన్నేళ్ల క్రితమే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా... ఏటా కొందరు ఉపాధ్యాయులు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. పరీక్షల సమయంలో వాట్సప్‌ ద్వారా ప్రశ్నపత్రాలను బయటకు పంపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ భాష (హిందీ, తెలుగు తదితర) పరీక్ష సమయంలో మూడు పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలు లీక్‌ అవడం తాజా ఉదాహరణ.

పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బందిని సరిగా తనిఖీ చేసే వ్యవస్థ లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు ఫోన్లను లోపలికి తీసుకెళ్తున్నారని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. కొన్ని చోట్ల చీఫ్‌ సూపరింటెండెంట్ల వద్ద ఫోన్లను డిపాజిట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, నిజామాబాద్‌ ఘటన తర్వాత విద్యాశాఖ అప్రమత్తమైంది. శుక్రవారం డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, మరోసారి 33 జిల్లాలను నాలుగు గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది.

క్యూఆర్‌ కోడ్‌ ఉన్నా భయపడలేదు

ప్రశ్నపత్రం లీక్‌ అయితే ఏ కేంద్రం నుంచి బయటకు వచ్చిందో గుర్తించేందుకు రెండేళ్లుగా ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తున్నారు. అయినప్పటికీ నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏమాత్రం భయపడకుండా ఫొటోలు తీసి వాట్సప్‌ ద్వారా బయటకు పంపారు. వాటికి సమాధానాలు రాసి విద్యార్థులకు అందించాలని ఆలోచించారు. ఈ ఘటనతో ఇద్దరు గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు సహా మొత్తం 9 మందిని సస్పెండ్‌ చేశారు.

2023 ఏప్రిల్‌లో వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు వాట్సప్‌ ద్వారా లీక్‌ అయ్యాయి. అప్పట్లో ఇన్విజిలేటర్లు, సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించినా అమలు కాలేదు.

మరికొన్ని లోపాలు

పోలీసు కానిస్టేబుళ్లు పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారం వద్దే ఉంటున్నారు. వారికి లోపలికి అనుమతి లేదు. విధుల్లో ఉన్న సిబ్బంది రాజీపడితే యథేచ్ఛగా కాపీయింగ్‌కు పాల్పడవచ్చు. ఇంటర్‌ పరీక్షల్లో కూడా ఇలాంటి లోపాలు గమనించబడ్డాయి. పరీక్షల సమగ్రత కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యాశాఖ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను అరికట్టగలవని ఆశిస్తున్నారు.

Tags: