Bhatti Vikramarka Urges Centre: విద్యారంగంలో భారీ పెట్టుబడులకు FRBM మినహాయింపు ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన భట్టి విక్రమార్క
కేంద్రాన్ని కోరిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Urges Centre: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలిసి రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా రంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు FRBM మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. సాస్కీ పథకం కింద రూ.5 వేల కోట్ల ప్రత్యేక సాయం కూడా అందించాలని భట్టి విక్రమార్క్ నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని తెలిపారు. నూతన రాష్ట్రంగా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, 2014-2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థల (SPV) ద్వారా తీసుకున్న అప్పుల భారం, చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని భట్టి విక్రమార్క్ వివరించారు. 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' ద్వారా రాష్ట్ర విద్యార్థులందరికీ ప్రపంచ స్థాయి విద్య అందించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
విద్యా రంగ అభివృద్ధికి మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఇందులో రూ.21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల క్యాంపస్‌ల నిర్మాణం, మరో రూ.9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క్ వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మరింత సహకరించాలని భట్టి విక్రమార్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.