Governor, CM Revanth Reddy: గాంధీ, శాస్త్రిజీకి ఘన నివాళి.. బాపూఘాట్లో గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి పుష్పాంజలి
పుష్పాంజలి
Governor, CM Revanth Reddy: జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎన్. రేవంత్‌రెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్ తదితరులు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్ర ప్రదర్శనను గవర్నర్, సీఎం తిలకించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేస్తూ... అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి ప్రపంచానికి చాటిన గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అదే సందర్భంగా భారతరత్న, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని కూడా స్మరించుకున్న సీఎం... దేశం కోసం నిస్వార్థంగా సేవలందించిన మహోన్నత నాయకుడిగా ఆయనను కొనియాడారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో సైనికుడి ధైర్యాన్ని, రైతు శ్రమను దేశ ప్రగతికి రెండు బలమైన స్తంభాలుగా చాటి చెప్పిన దార్శనికుడని అన్నారు. నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి ప్రతిరూపంగా నిలిచిన శాస్త్రిజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీఎం వ్యాఖ్యానించారు.
బాపూఘాట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొని జాతిపిత, శాస్త్రిజీలకు నివాళులు అర్పించారు.