Hyderabad Metro-RTC Common Pass: హైదరాబాద్‌ మెట్రో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) సేవలకు ఉమ్మడి పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

క్యూర్‌ పరిధిలోని ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిరాటంకమైన ప్రజారవాణా అనుసంధానం కల్పించడమే ఈ కామన్‌ పాస్‌ లక్ష్యం. రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

రోజువారీ ఉమ్మడి పాస్‌ ధర రూ.400 (మెట్రో ఛార్జీ రూ.300, ఆర్టీసీ ఛార్జీ రూ.100). నెలవారీ పాస్‌ రూ.8,500 (మెట్రో రూ.7,000, ఆర్టీసీ రూ.1,500). మొదటిసారి కొనుగోలు చేసేటప్పుడు కార్డు కోసం రూ.100 వసూలు చేస్తారు. కార్డును తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తం వాపసు చేస్తారు.

ఒకే పాస్‌తో ఓఆర్‌ఆర్‌ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీబస్సుల్లో (పుష్పక్‌కు మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ఈ పాస్‌లు మెట్రో రైలు స్టేషన్లలో, ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

ప్రజారవాణాను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రయాణికులకు ఊరటనిస్తోంది.

Tags: