Minister Ponguleti: జీఓ 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 500 చదరపు గజాల లోపు ఉన్న జీఓ 59 పెండింగ్‌ దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మెమో నంబర్‌ 48030 పేరిట కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి.. 22ఎ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో మరో ముఖ్యమైన అడుగు పడిందని తెలిపారు. ఇప్పటివరకు 22ఎ సమస్యల పరిష్కారానికి ఏడు కీలక ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. జీఓ 59 అమలులో అక్రమాలకు ఎలాంటి తావు లేదని, నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో జీఓ 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్‌ డీడ్స్‌ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

జీఓ 59 ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి క్రమబద్ధీకరణకు ఉద్దేశించినదేనని మంత్రి గుర్తు చేశారు. 22ఎ సమస్యలపై సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, 10-12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేశామన్నారు.

22ఎలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని మంత్రి చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు కూడా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయాలతో జీఓ 59 దరఖాస్తుదారులకు, 22ఎ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి గణనీయమైన ఉపశమనం లభించనుంది.

Tags: