University of Colorado Denver (CU Denver): హైదరాబాద్‌లో అమెరికా ప్రభుత్వ వర్సిటీ తొలి క్యాంపస్.. 2027లో తరగతులు
2027లో తరగతులు
University of Colorado Denver (CU Denver): అమెరికాకు చెందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం భారత్‌లో ఏర్పాటు చేసే తొలి క్యాంపస్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ (సీయూ డెన్వర్) తన విదేశీ ప్రాంగణాన్ని నగరంలో ప్రారంభించనుంది. హైదరాబాద్‌లో క్యాంపస్‌ను నెలకొల్పేందుకు ఆ వర్సిటీ తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) పొందింది. దీంతో తెలంగాణలోనే కాదు, భారత్‌లో ప్రాంగణం కోసం అనుమతి పొందిన తొలి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా సీయూ డెన్వర్ నిలవనుంది.
2027 ఆగస్టు నుంచి తొలి బ్యాచ్‌తో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యా నాణ్యత, ఫలితాలు, ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణమైన నైపుణ్యాలపై ఈ వర్సిటీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో కోర్సులను అందించనుంది. తర్వాత యూజీసీ అనుమతుల మేరకు మరిన్ని కోర్సులను కూడా పరిచయం చేయనున్నారు.
వర్సిటీ ఛాన్సలర్ కెన్నెత్ క్రిస్టెన్సెన్ మాట్లాడుతూ, భారతీయ విద్యార్థులతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ క్యాంపస్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామని, వివిధ రంగాల్లో తమకున్న ప్రత్యేక అనుభవాన్ని భారత్‌లోని విద్యార్థులకు అందించే అవకాశం లభించిందని తెలిపారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ అయిన ఎమెరిటస్ భారత్‌లో ఈ వర్సిటీకి వ్యూహాత్మక జాయింట్ వెంచర్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎమెరిటస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్ దామెరా మాట్లాడుతూ, ప్రపంచ అవసరాలకు అనుగుణమైన విద్యను మన దేశ విద్యార్థులకు ఈ వర్సిటీ చేరువ చేస్తుందని చెప్పారు.
యూజీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎనిమిది విదేశీ వర్సిటీలు తమ క్యాంపస్‌లకు పూర్తిస్థాయి అనుమతులు పొందాయి. అందులో నాలుగు వర్సిటీలు తరగతులను ప్రారంభించాయి. వాటిల్లో నాలుగు మహారాష్ట్రలో, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో రెండేసి ఉన్నాయి. అవన్నీ యూకే, ఆస్ట్రేలియా దేశాలకు చెందినవే. ఇంకా 11 వర్సిటీలు ప్రాథమిక అనుమతులు పొందాయి. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతోపాటు మరో నాలుగు అంతర్జాతీయ వర్సిటీలు ఫ్యూచర్ సిటీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.