Graduate MLC Voter Registration: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల సంఘం తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాల రూపంలో స్పష్టత ఇచ్చింది.

ఓటరుగా నమోదు కావాలంటే 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ లేదా సమానమైన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఆ తేదీలోపు విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ జారీ చేసిన డిగ్రీ ధ్రువపత్రం, మార్కుల మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే సంబంధిత నియోజకవర్గం పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. డిగ్రీ కంటే ఎక్కువ అర్హతలున్న వారు కూడా ఫారం-18తోనే నమోదు చేసుకోవచ్చు. ఇది తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో ceotelangana.nic.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గతంలో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. పాత జాబితాను పరిగణనలోకి తీసుకోరు. ప్రతి ఎన్నికలకు కొత్త జాబితా తయారు చేయాల్సిందే.

ఫారం-18 నింపిన తర్వాత తహసీల్, ఆర్డీవో కార్యాలయాల్లోని ఏఈఆర్వోలు లేదా డిజిగ్నేటెడ్ అధికారులకు సమర్పించాలి. దానితోపాటు డిగ్రీ ఒరిజినల్ ధ్రువపత్రం, ప్రొవిజనల్ లేదా మార్కుల మెమోను చూపించాలి. అధికారి పరిశీలించి ఫొటోకాపీపై ధ్రువీకరణ రాసి సంతకం చేస్తారు. ఒరిజినల్ తీసుకురాలేకపోతే జిల్లా గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన ఫొటోకాపీ సరిపోతుంది. ప్రభుత్వ కార్యాలయం, కళాశాల, బార్, మెడికల్ కౌన్సిల్ లేదా విశ్వవిద్యాలయం వద్ద సర్టిఫికెట్ ఉంటే సంబంధిత గెజిటెడ్ అధికారి జారీ చేసిన ధ్రువపత్రం సమర్పించవచ్చు.

ఆధార్, ఓటరు ఎపిక్ నంబర్ వివరాలు తప్పనిసరి కాదు. ఇచ్చినా అధికారులు వాటిని బహిరంగపరచరు. ఒకే వ్యక్తి రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో నమోదు కావడానికి అవకాశం లేదు. ఒక్క చోట మాత్రమే నమోదు కావాలి.

నవంబర్ 6 వరకు ఫారం-18 స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది జాబితా విడుదల అవుతుంది.

పట్టభద్రులు ఈ వివరాలు గమనించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

Tags: