ఎలైన్‌మెంట్ సమయంలో భారీ భూలావాదేవీలపై ఫిర్యాదులు.. ఆరు నెలలుగా క్యాబినెట్ ఆమోదం పెండింగ్

Regional Ring Road (RRR): తెలంగాణ అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టులోని ఉత్తర భాగం పనులు త్వరలో ప్రారంభమవుతాయని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ అనుమతి దశలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బ్రేకులు పడినట్లు సమాచారం వెలువడింది.

ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణ అనుమతి దస్త్రం దాదాపు ఆరు నెలలుగా కేంద్ర క్యాబినెట్‌కు చేరకుండా పెండింగ్‌లోనే ఉంది. ఈ రోడ్డుకు రెండేళ్లలో మూడుసార్లు టెండర్లు పిలిచినా, మూడోసారి పిలిచిన టెండర్లకు నేటికీ అనుమతి లభించలేదు. ఎలైన్‌మెంట్ ఖరారు సమయంలో భారీగా భూముల కొనుగోళ్లు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అందుకే ప్రస్తుత ఎలైన్‌మెంట్‌ను యథాతథంగా ఆమోదించడానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ప్రస్తుతానికి సుముఖంగా లేదని వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 21న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఎప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మోర్త్ నుంచి క్యాబినెట్ ఆమోదానికి పంపించాల్సి ఉంది. కానీ దస్త్రం ఆరు నెలలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందకుండా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఇటీవల ఢిల్లీకి వెళ్లి వివరాలు తెలుసుకుంది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ఎలైన్‌మెంట్ ఖరారు సమయంలో అక్కడ భారీగా భూముల కొనుగోళ్లు జరిగాయంటూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఈ ప్రాజెక్టు అనుమతి అంశం ముందుకు వెళ్లకుండా ఆగింది’’ అని కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని జైపుర్ ప్రాంతీయ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయంలోనూ ఇలాంటి భూలావాదేవీలపై ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర వర్గాలు సూచించాయి.

టెండర్లు మూడుసార్లు.. భూసేకరణ 90 శాతం పూర్తి

ఆర్‌ఆర్‌ఆర్‌కు 2024 డిసెంబరులో తొలిసారి టెండర్లు పిలిచారు. తొలుత నాలుగు వరుసలుగా ప్రకటించి, ఆ తర్వాత ఆరు లేన్లకు పెంచి 2025 నవంబరులో రెండోసారి టెండర్లు పిలిచారు. 2026 మేలో రెండు ప్యాకేజీలుగా మూడోసారి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. బిడ్లు జులై 7న తెరవాల్సి ఉన్నా, ప్రతి నెలా పొడిగించి తాజా గడువు అక్టోబర్ 22కు వచ్చింది. ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తయింది. రూ.1,292.5 కోట్ల పరిహారానికి అవార్డు ఖరారైంది. ఇలాంటి కీలక సమయంలో దస్త్రాన్ని కేంద్ర క్యాబినెట్ పెండింగ్‌లో పెట్టడానికి భూలావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులే కారణమా.. లేక మరేదైనా అంశముందా అన్నది స్పష్టం కావడం లేదు. ప్రస్తుత ఎలైన్‌మెంట్‌తోనే ముందుకెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా.. లేదా మార్పులపై కేంద్రం దృష్టి పెడుతుందా అన్న సందిగ్ధత నెలకొంది.

ప్రాజెక్టు వివరాలు

ఉత్తర భాగం రోడ్డు పొడవు: 161.51 కి.మీ. (సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు)

రహదారి వరుసలు: ఆరు (గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే)

సేకరించాల్సిన మొత్తం భూమి: 1,918.5 హెక్టార్లు

అవార్డు ఆమోదించింది: 1,729.08 హెక్టార్లు

ఇప్పటివరకు అవార్డు పరిహారం: రూ.1,292.5 కోట్లు

భూసేకరణలో పురోగతి: 90.1 శాతం

ఉత్తర భాగానికి కేటాయించిన నంబరు: నేషనల్ హైవే 161ఏఏ

తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు ఆమోదంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Tags: