Harish Rao Alleges: కాంగ్రెస్ పాలనలో బాలికల భద్రత దెబ్బతిందని, విద్యార్థుల యూనిఫాం కాంట్రాక్టుల్లో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీశ్‌రావు ఆరోపణ
హరీశ్‌రావు ఆరోపణ
Harish Rao Alleges: ఖమ్మంలో బాలికపై జరిగిన పైశాచిక దాడి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలకు నిదర్శనమని భారాస శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను గురువారం పరామర్శించిన ఆయన, ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద బాలికకు ఉచిత వైద్యం కూడా అందించకుండా, వైద్యులు రూ.వేల విలువైన మందులు కుటుంబం నుంచి కొనిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలా తనానికి నిదర్శనమని హరీశ్‌రావు దుయ్యబట్టారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదారు పోక్సో కేసులు నమోదవుతున్నాయని, బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన ముదిగొండ రాంబాబు అనే వ్యక్తిపై అక్రమ కేసులు పెడతామంటూ ఖమ్మం పోలీసులు బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆ పోలీసు అధికారిపై డీజీపీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు భారాస పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటికే కొంత ఆర్థిక సాయం అందించామని వెల్లడించారు.
విద్యార్థుల దుస్తులు, బూట్ల కాంట్రాక్టుల్లో అవకతవకలు
హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించి మరిన్ని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్‌లు, బూట్ల కాంట్రాక్టుల్లో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. భారాస ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు, దళిత కుటుంబాలకు ఈ పనులు అప్పగించగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గుజరాత్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు గుప్పించుకుంటున్నారని విమర్శించారు.
అంతేకాకుండా, జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి సన్నిహితులు రూ.70 కోట్లతో విలాసవంతమైన గెస్ట్‌హౌస్ (బోధి పెవిలియన్) నిర్మిస్తున్నారని, దీని చుట్టూ ఇనుప కంచెలు, స్టేడియం వంటి పనులకు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు, రైతు భరోసా నిధులకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఈ విలాసవంతమైన నిర్మాణాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తోందని ప్రశ్నించారు.
ఫ్యూచర్‌సిటీ గ్రామాల్లో అదనపు ఇంపాక్ట్ ఫీజు పేరిట ప్రజల నుంచి అదనంగా వసూలు చేయాలని ప్రణాళిక చేస్తున్నారని, ఫార్మాసిటీ కోసం తన సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చానని హరీశ్‌రావు తెలిపారు. భారాస అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పునరుద్ధరణ
పోలీసు ఉద్యోగాలకు గతంలో ఉన్న వయోపరిమితిని (కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్‌ఐకి 38 ఏళ్లు) పునరుద్ధరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 5 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు. మొత్తం ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, నేతలు ఉపేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.