High Court: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా శుక్రవారం హైకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన, సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది.

సందీప్ సుల్తానియాపై వెయ్యి కేసులు ఉన్నాయని, అవన్నీ విచారణ చేస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు చేసిన తప్పులకు అధికారులు ఈ పరిస్థితిలోకి నెట్టబడుతున్నారని న్యాయమూర్తులు అన్నారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధాకరమని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే హాజరు కావాలని ఆదేశిస్తున్నామని స్పష్టం చేశారు.

ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి చాలా ప్రమాదం ఉందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రైతుబంధు పథకం కింద సంపన్నులు, అధికారులు కూడా డబ్బులు తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. రైతుబంధు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ కేసు నేపథ్యం ఏమిటంటే.. 2024లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సందీప్ సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని రామకృష్ణ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిలు విడుదల చేయాలన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గురువారం సందీప్ సుల్తానియాను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేసి హాజరుపరచాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది.

అయితే శుక్రవారం కచ్చితంగా హాజరవుతానని తెలపడంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, రూ.5,000 పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేశారు. హైదరాబాద్ పోలీసులు ఈ వివరాలను కోర్టుకు సమర్పించారు.

ఉచిత పథకాల సంస్కృతి, అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ వైఫల్యాలపై హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

Tags: