మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ప్రారంభం.. శుద్ధ జలంతో డేటా కేంద్రాలకు సరఫరా చేసే తొలి నగరం

Hyderabad: రాష్ట్రం సాంకేతిక పరిజ్ఞానం, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతోందని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఇండియా సౌత్‌ సెంట్రల్‌ డేటా సెంటర్‌ రీజియన్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఈ సెంటర్‌ ద్వారా హైదరాబాద్‌ భారతదేశానికే కాకుండా ఆసియా, గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు కీలకమైన ఏఐ, క్లౌడ్‌ హబ్‌గా మారుతుంది. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్‌కు ఉన్న బంధం ప్రత్యేకమైంది. తెలంగాణలో ప్రస్తుతం 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాలు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. 2029 నాటికి 5 గిగావాట్లకు పెంచడమే కాకుండా.. రూ.30 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 12 గిగావాట్ల డేటా కేంద్రాల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి’’ అని వివరించారు.

డేటా కేంద్రాలకు ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన నీరు (గ్రే వాటర్‌) సరఫరా చేయనున్న తొలినగరంగా హైదరాబాద్‌ నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌ పర్యావరణహితంగా ‘జీరో వాటర్‌ కూలింగ్‌’ సాంకేతికతతో పనిచేస్తుందని తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఎండీ, అధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకుపైగా భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రయాణంలో హైదరాబాద్‌ ముఖ్యమైన భాగంగా ఉందన్నారు. భారత్‌లో తమ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ఇదేనని మైక్రోసాఫ్ట్‌ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్‌ చందోక్‌ అన్నారు. సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదేరోజు మాదాపూర్‌లో నిర్వహించిన ‘రైజ్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ సమిట్‌-2026’లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగాలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా హైదరాబాద్‌ను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఏఐ, డేటా సైన్స్, బయో టెక్నాలజీ సేవలను అనుసంధానించడం ద్వారా వైద్యరంగానికి సరికొత్త రూపం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్‌ డాక్టర్‌ జి.వి.రావు వైద్యరంగంలో ఏఐ వినియోగంపై అపోహలు వీడాలన్నారు. హెల్త్‌ ఆర్క్‌ సంస్థ రూపొందించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

Tags: