‘ఉత్తమ ప్రజా సేవకుడు-2026’గా ఎంపిక… నేడు కేరళలో ప్రదానోత్సవం

CM Revanth Reddy: ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌’ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.

తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి కలిగిన నాయకత్వం దృష్ట్యా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్‌, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఏ.పి. అనిల్‌కుమార్‌, కల్పేట్టా నారాయణన్‌లు జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై రేవంత్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను జ్యూరీ కొనియాడింది.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం (సెప్టెంబర్‌ 25) సాయంత్రం 4 గంటలకు అవార్డును ప్రదానం చేస్తారు. పురస్కారం కింద లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. ఈ వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్‌ ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకోపన్యాసం చేస్తారు.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలందించారు. రాజనీతిజ్ఞుడిగా, దూరదృష్టి గల నేతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, సమర్థుడైన పాలకునిగా, కార్మిక వర్గ ఛాంపియన్‌గా కేరళ ప్రజల మదిలో నిలిచిపోయారని ఫౌండేషన్‌ పేర్కొంది.

Tags: