CM Revanth Reddy: ఇకపై 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2026-05-30 12:50 GMT

CM Revanth Reddy: ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలని, కార్యకర్తలతో సన్నిహితంగా మెలగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను క్షేత్రస్థాయి కార్యకర్తలను 10 రోజులకోసారి కలుస్తానని, నెలలో మూడు రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని ప్రకటించారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాల్సిందేనని ఆదేశించారు.

శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు:

మంత్రులు తాము ఇన్‌ఛార్జిగా ఉన్న జిల్లాకు ప్రతి 10 రోజుల్లో ఒకరోజు వెళ్లి పార్టీ కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయించాలి.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్‌పర్సన్లు, సీనియర్ నాయకులు వారంలో ఒకరోజు నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలను కలవాలి.

ఎవరు ఎక్కడికి వెళ్లాలనేది పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు.

ఎమ్మెల్యేలపై చురక:

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్లుగా పని చేసిందని, కానీ ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు జమీందార్లలా మారిపోయారని సీఎం విమర్శించారు. వ్యక్తిగత ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారని, పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని మందలించారు. పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

‘సర్‌’ కార్యక్రమంపై దృష్టి:

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) కార్యక్రమంపై అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నేతలు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్‌గా ఉంటారన్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని, నగరంలోని 15 నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

మహిళా కాంగ్రెస్ క్లస్టర్ల వారీగా భేటీలు పెట్టాలని సూచించారు. లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే ప్రమాదం ఉందని, దీనికి సమస్యలు గుర్తించి పరిష్కారాలు చూడాలని తెలిపారు.

అప్పుడు పని చేసిన వారిని గుర్తించాలి:

పార్టీ కోసం గతంలో కష్టపడిన కార్యకర్తలను ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి, మహేశ్‌కుమార్ గౌడ్, సచిన్ సావంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News