Indian National Congress: ‘కేరళ విజయం’తో రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌!

రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌!

Update: 2026-05-05 12:20 GMT

Indian National Congress: కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి సాధించిన అసాధారణ విజయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం, జోష్‌ను రెట్టింపు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌బాబు తదితర నేతలు కేరళలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు పర్యటించిన చోట్ల యూడీఎఫ్‌ మంచి ఫలితాలు సాధించడం గమనార్హం.

కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌రెడ్డిని కేరళ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో సీఎం స్వయంగా కోవలం, మావెలిక్కర, పథానపురం, నేమం, కొచ్చిన్, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో రోడ్‌షోలు, ప్రచార సభలు నిర్వహించి పార్టీ విజయానికి కృషి చేశారు. యూడీఎఫ్‌ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, కేరళను కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి యూడీఎఫ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారానికి కేరళ ప్రజలు స్పందించి మద్దతు ప్రకటించారని రాష్ట్ర నేతలు తెలిపారు.

రేవంత్‌ అభినందనలు: కేరళలో సాధించిన చారిత్రక విజయానికి నేతృత్వం వహించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ తదితర నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

‘కేరళ, తెలంగాణ గొప్ప రాష్ట్రాలు. ఇరు రాష్ట్రాల ప్రజలు విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగి అభివృద్ధిని విశ్వసిస్తారు. కాంగ్రెస్‌ పాలనలో భవిష్యత్తు మెరుగైనదవుతుందని కేరళ ప్రజలు నమ్మారు. నాపై అపారమైన ప్రేమ కురిపించిన అక్కడి ప్రజలకు ధన్యవాదాలు’ అని సీఎం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.

ఈ విజయం తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News