CM Revanth Reddy: జై యువ.. భవిష్యత్తు నినాదం ఇదే: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2026-07-27 05:05 GMT


CM Revanth Reddy: ‘జై జవాన్‌.. జై కిసాన్‌’తోపాటు ఇకపై ‘జై యువ’ నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం యువతతో పోరాడాలని భావిస్తే గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో యువశక్తి ముందు 56 అంగుళాల ఛాతీ తలవంచిందన్నారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలపై దేశవ్యాప్తంగా యువత పోరాటం చేయడంతోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.

పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సీఎం తెలిపారు. ‘‘వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు బానిసలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నించింది. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ఆ నల్ల చట్టాలను వ్యతిరేకించారు. ప్రతిపక్షాల మాటలను పట్టించుకోకపోవడంతో రైతులు వీధుల్లోకి వచ్చి పోరాడి, చివరకు కేంద్రం చట్టాలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సీబీఎస్‌ఈ, నీట్‌ తదితర జాతీయ పరీక్షల నిర్వహణలో కేంద్రమే విఫలమైంది. యువత వీధుల నుంచి పార్లమెంట్‌ వరకు తమ శక్తిని ప్రదర్శించింది. ప్రధానమంత్రి రాజీనామా కోరుతున్న పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించడం ద్వారా కేంద్రం నష్టనివారణ చర్యలకు దిగింది’’ అని అన్నారు.

విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని, నీట్‌ లీకేజీ కారణంగా పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 21 ఏళ్ల యువత ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా, ఫార్చ్యూన్‌-500 కంపెనీల సీఈఓలుగా రాణిస్తున్న నేపథ్యంలో వారు రాజకీయాల్లో ఎందుకు భాగస్వాములు కాలేరని ప్రశ్నించారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభకు 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని, పార్లమెంట్‌లో సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌, వయోపరిమితి తగ్గింపుపై సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే జేపీసీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News