Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: గాలి ఎటు వీస్తోంది.. బెట్టింగ్‌రాయుళ్ల ఉత్కంఠ
బెట్టింగ్‌రాయుళ్ల ఉత్కంఠ
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై బెట్టింగ్ రాయుళ్లు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై పందేలు కాస్తున్నారు. ఈ సీటును నిలబెట్టుకోవాలని భారాస, గెలిచి తీరాలని కాంగ్రెస్, తమ ఉనికిని చాటుకోవాలని భాజపా పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. నవంబరు 11న జరగనున్న ఈ ఎన్నికపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ప్రచార దశలోనే ఫలితాలపై పలువురు తమ లెక్కలు వేసుకుంటున్నారు. ఏపీ నుంచి కూడా బెట్టింగ్‌రాయుళ్లు ఇక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. విజయవాడకు చెందిన కొందరు హైదరాబాద్‌లోని తమ సన్నిహితులను సంప్రదించి, అక్కడి రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. బెట్టింగ్ వేస్తున్నాను.. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో చెప్పమని ఓ వ్యక్తి తన మీడియా మిత్రుడికి రెండు రోజుల సమయం ఇచ్చాడు. సర్వేల సమాచారాన్ని సేకరిస్తూ, వివిధ సంస్థలు ఇస్తున్న విభిన్న అంచనాలతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
అభయహస్తం ప్రచారం
యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
భారాస భరోసా ప్రకటన
వెంగళరావునగర్‌లో భారాస అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కమల వికాస హామీ
నందనగర్‌లో భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ప్రచారం సాగించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.