K. T. Rama Rao Strongly Condemns: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై భాజపా దాడి: కేటీఆర్‌ తీవ్ర ఖండన

కేటీఆర్‌ తీవ్ర ఖండన

Update: 2026-05-07 13:30 GMT

‘పట్టపగలు గూండాయిజం.. పోలీసులు ప్రేక్షకులు’

K. T. Rama Rao Strongly Condemns: కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనుచరులు చేసిన దాడిని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ‘హేయమైన, దుర్మార్గపూరిత చర్య’గా అభివర్ణించారు.

దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ప్రకటించిన కేటీఆర్‌, పట్టపగలు గూండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వాహనాలు, ఆఫీసు సామగ్రిని ధ్వంసం చేయడం అత్యంత నింద్యమైన చర్య అని మండిపడ్డారు. కళ్ల ముందు ఇంత అరాచకం జరుగుతుంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండటం సిగ్గుచేటని ఆక్షేపించారు.

‘బీటీమ్‌గా మారిన బండి సంజయ్‌’

సీఎం రేవంత్‌రెడ్డికి బీ టీమ్‌గా మారిన బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి హింసాత్మక చర్యలకు ఉసిగొల్పుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతో శాంతి భద్రతలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లని ఆయన మండిపడ్డారు.

హరీశ్‌రావు ఆగ్రహం:

ఈ దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఈ సంఘటన కరీంనగర్‌లో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది.

Tags:    

Similar News