CM Revanth Reddy: మెట్రో విస్తరణకు అడ్డంకులు సృష్టిస్తున్న కిషన్ రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి

Update: 2026-06-15 08:46 GMT

కేసీఆర్ పాలనలో మెట్రో నిర్మాణం నిర్లక్ష్యం - గత ప్రభుత్వం ఆలస్యం చేసింది

CM Revanth Reddy: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పాలనలోనే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని, రూ.15 వేల కోట్లతో ప్రాజెక్ట్ ముందుకు సాగిందని సీఎం వివరించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యం చూపించిందని తీవ్ర విమర్శలు చేశారు. 2014-17 మధ్య మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని, కేసీఆర్ సాకులు చెప్పి మూడేళ్లు ఆలస్యం చేశారని మండిపడ్డారు. దీంతో రూ.7 వేల కోట్ల అంచనాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో నిర్మాణం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, 122 కి.మీ. మెట్రో విస్తరణకు L&T సంస్థ తిరస్కరించిందని తెలిపారు. గతంలో ఢిల్లీ, హైదరాబాద్ మెట్రోలు అగ్రస్థానంలో ఉండేవని, కానీ గత పాలకుల స్వార్థ ఆలోచనల వల్ల విస్తరణ ఆలస్యమైందని ఆరోపించారు.

తొలి దశ మెట్రో నుంచే నష్టాలు వస్తున్నాయని L&T చెప్పిందని, ఏటా రూ.400 కోట్లకు పైగా నష్టం ఎదుర్కొంటోందని సీఎం వెల్లడించారు. రెండో దశలో భాగస్వామ్యానికి L&T నిరాకరించిందని, L&T నుంచి మెట్రో కొనుగోలు చేస్తేనే సమస్యలు పరిష్కరించవచ్చని కేంద్రం సూచించిందన్నారు. రూ.30 వేల కోట్ల మెట్రోను రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని, ప్రస్తుతం కి.మీ.కు రూ.350 కోట్లు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు.

IRFC రుణం బదిలీ ప్రక్రియకు అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, రూ.84 కోట్ల డాక్యుమెంట్ ఫీజు చెల్లించామని, ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. రూ.13,400 కోట్లకు 4 శాతం వడ్డీతో 20 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిర్చామన్నారు.

అయితే మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కిషన్ రెడ్డి కలిసి అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా అని ఒత్తిడి చేశారని, కిషన్ రెడ్డి వల్లే రుణం బదిలీ ఆగిపోయిందని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్ట్‌ను కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా లేదా అని సీఎం ప్రశ్నించారు.

Tags:    

Similar News