Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి బయల్దేరారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు-చేర్పులపై హైకమాండ్ దృష్టి సారించిన నేపథ్యంలో కీలక నేతలు వరుసగా ఢిల్లీ బాట పట్టారు. ఈ క్రమంలోనే సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఆమె వివరణ ఇచ్చారు. వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై తయారైన నివేదికను కూడా టీపీసీసీ అధిష్ఠానానికి పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం వ్యాపించింది. దీంతో ఆమె ఢిల్లీకి పిలుపు రావడం ఉత్కంఠను రేకెత్తించింది.

సురేఖ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా కోరారు. ఈరోజు సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కీలక భేటీలో ఆమె పాల్గొననున్నట్లు సమాచారం. ఆమెను బర్తరఫ్ చేసే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో ఆమె భవితవ్యంపై స్పష్టత రావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే అక్కడ ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఢిల్లీలోనే ఉండి మల్లికార్జున ఖర్గేను కలిశారు. మంత్రివర్గంలో స్థానం కోరుతూ ఆయన విజ్ఞప్తి చేశారు.

కేసీ వేణుగోపాల్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కలుస్తారని ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందని, ఆ హామీని గుర్తు చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు.

మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకాల నేపథ్యంలో ఢిల్లీకి ఆశావాహులు వరుస కడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ మంత్రివర్గంలో కొనసాగుతారా లేదా అనే అంశంపై అధిష్ఠానం నిర్ణయంపై అందరి దృష్టి సారించి ఉంది.

Tags: