High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే రద్దు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఊరట
High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ రెండు సంక్షేమ పథకాలపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను చీఫ్ జస్టిస్ ధర్మాసనం మంగళవారం రద్దు చేసింది.
పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
2014 నుంచి అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలపై వ్యక్తిగత హోదాలో న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సింగిల్ బెంచ్ స్టే విధించిందని ఏజీ తెలిపారు. ఈ పథకాల అమలు పిటిషనర్‌పై ఎలాంటి ప్రభావం చూపడం లేదని, అతని హక్కులకు భంగం కలగడం లేదని, అతను లబ్ధిదారు కూడా కాదని వాదించారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌కు సింగిల్ బెంచ్‌లో విచారణార్హత లేదని స్పష్టం చేశారు.
షాదీ ముబారక్ పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిందని, అలాంటిదే కల్యాణలక్ష్మి పథకమని ఏజీ పేర్కొన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించే పరిధి డివిజన్ బెంచ్‌కు ఉందని తెలిపారు. స్టే కారణంగా పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, నిరుపేద కుటుంబాలకు ఈ పథకాల వల్ల మేలు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే స్టేను ఎత్తివేయాలని కోరారు.
అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మళ్లీ సాఫీగా అమలు కావడానికి మార్గం సుగమమైంది.