Konda Surekha & Chinna Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎపిసోడ్‌కు తెరపడింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపిన సీఎంవో, అదే సమయంలో చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.

రేవంత్ సర్కార్ ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. పార్టీ క్రమశిక్షణ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని అగ్రనాయకత్వం స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది.

ఆగస్టు 16న వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి, సొంత పార్టీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని, వనపర్తి టికెట్ తనకు ఇవ్వాలని సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పారని, తన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారని చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని, గెలుపు తర్వాత వనపర్తిని కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చేశారని, తన పనులకు అడ్డుపడుతున్నారని, తన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలపై మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నానన్న ఆరోపణను ఖండిస్తూ, ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం సర్వే నిర్వహించి గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇచ్చిందని చెప్పారు. చిన్నారెడ్డి ఎవరికి డబ్బులు ఇచ్చారో పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో తాను పోటీ చేయనని చెప్పిన చిన్నారెడ్డి, ఇప్పుడు అనవసర వ్యాఖ్యలతో పార్టీకి, తన ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించి, కొండా సురేఖపైనా చర్యలు తీసుకోవడంతో పార్టీలో క్రమశిక్షణపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags: