Minister Uttam: కాళేశ్వరంపై కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు.. నాసిరకం డిజైన్‌తోనే కూలింది: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్
Minister Uttam: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నాసిరకం డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కాళేశ్వరం కూలిపోయిందని పేర్కొన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా కట్టి ఉంటే ఈ సమస్య రావాల్సిన అవసరం లేదని అన్నారు. బ్యారేజీలో 2-3 టీఎంసీలు నిల్వ చేయమంటే 10 టీఎంసీలు ఎందుకు స్టోర్ చేశారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు.
కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సమావేశం ఈ నెల 31న నిర్వహిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ సమీక్ష జరుగుతుందని, ఎన్‌డీఎస్‌ఏ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మూడు బ్యారేజ్‌లను టెస్టింగ్ చేస్తున్నామని, ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో రిహబిలిటేషన్ డిజైన్స్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు సూచించారని, కాపర్ డ్యాం కట్టాలా వద్దా అనే విషయంలోనూ వారి సలహా ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. రైతులకు నీళ్లు అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైడ్రా విషయంలో మాట్లాడుతూ, అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిధిలోని శాఖ అని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.