Revanth Reddy Appeals to Chandrababu Naidu: జల వివాదాలు మనమే పరిష్కరించుకుందాం: చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి
చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి
Revanth Reddy Appeals to Chandrababu Naidu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న నీటి వివాదాలను రాజకీయాలకు అతీతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కోర్టుల ద్వారా కాకుండా, మన సమస్యలను మనమే చర్చించి తీర్చుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నీటి సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతాను. వివాదాలా.. పరిష్కారమా అని అడిగితే పరిష్కారమే కావాలని అంటాను’’ అని స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులకు అనుమతుల్లో అడ్డంకులు సృష్టించొద్దని చంద్రబాబును కోరారు. ‘‘ఇలాంటి అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మేం వివాదాలు కోరుకోవడం లేదు.. పరిష్కారాన్నే కోరుకుంటున్నాం. ప్రజల ప్రయోజనాలే మా లక్ష్యం. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే పొరుగు రాష్ట్రం సహకారం అవసరం. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తేనే సమస్యలు తీరతాయి. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతోనూ వివాదాలు కాదు.. సహకారమే కోరుకుంటున్నాం. ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. తెలంగాణ 10 అడుగులు వేస్తుంది’’ అని హామీ ఇచ్చారు.
అదనంగా, హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందని పేర్కొన్న సీఎం, సుజెన్ మెడికేర్ వంటి సంస్థలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని కొనియాడారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలుగా భారతీయులు ఉండటం గర్వకారణమని అన్నారు.