Uttam Kumar Reddy: తెలంగాణ సొమ్ము దోచుకుని ఇప్పుడు మొసలి కన్నీళ్లు.. భారాసపై ఉత్తమ్ ఘాటు విమర్శ
ఉత్తమ్ ఘాటు విమర్శ
Uttam Kumar Reddy: తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్ర సొమ్ము లూటీ చేసిన భారతీయ రాష్ట్ర సమితి (భారాస) నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. భారాస ద్వంద్వ విధానాల నుంచి తామేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ గుత్తేదారుల నుంచి ముడుపులు తీసుకున్నారని కవిత చేసిన ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని సూచించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. గతంలో అధికారం కోసం ఏపీతో కుమ్మక్కై నాగార్జునసాగర్ ప్రాజెక్టును వివాదం చేసిన భారాస, ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోందని ఆయన ఎత్తి చూపారు.
ఏపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశంలోనూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే ఉందని, ఇది కొత్త విషయం కాదని మంత్రి తెలిపారు. భారాస అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగాయి. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభమైంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఇవన్నీ నిజాలేనని గుర్తు చేశారు. ఈనెల 18న జరగనున్న జీఆర్‌ఎంబీ సమావేశ ఎజెండాలో ఏపీ చేర్చిన అంశాలు కూడా కొత్తవి కావని, ఇవే విషయాలను గత సమావేశాల్లోనూ ప్రస్తావిస్తూ వచ్చిందని అన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి క్లియరెన్సులు రాకుండా ఏపీ అడ్డుపడినా, ప్రస్తుత ప్రభుత్వం దీటుగా స్పందించి 2025లో అనుమతులు సాధించిందని ఉత్తమ్ పేర్కొన్నారు. కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కోర్ట, మోదికుంటవాగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదని ఏపీ నిరంతరం కోరుతూ వస్తోందని, వాటిని ప్రతిఘటించి తెలంగాణ నీటి హక్కులు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు.
అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ క్లియరెన్సు, ఐపీ క్లియరెన్సు పొందడంలో గత భారాస ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ఛత్తీస్‌గఢ్ ముంపు సమస్యపై కూడా సంప్రదింపులు జరపలేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం సంప్రదింపులు చేసి ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు కృషి చేస్తోందని, ఈ నెలాఖరులో ఎన్‌వోసీ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని ఉత్తమ్ తెలిపారు. 2018-22 మధ్య రాయలసీమకు 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులు జరిగినా భారాస ప్రేక్షక పాత్ర పోషించిందని, ప్రస్తుత ప్రభుత్వమే ఆర్డీఎస్‌లో వాటా, ఆధునికీకరణ కోసం ఏపీ, కర్ణాటకలను ఒప్పించిందని మంత్రి వివరించారు.